విజయశాంతి సహా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతితోపాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చింది. కాగా, అధిష్టానం కోటాలో విజయశాంతికి టికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.
విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన సమయంలోనే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే, శంకర్ నాయక్ పేరు ఎవరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనకు టికెట్ రావడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది.

కాగా, కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తనదైన స్టైల్‌లో అభ్యర్థుల ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసినవారికి, పార్టీలో పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని విధంగా విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లు తెరపైకి రావడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు ప్రాధాన్యత లభించింది.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులకు కూడా టికెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ.. అలా కూడా జరగలేదు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావితం చూపే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని భావించినప్పటికీ.. నిరాశ ఎదురైంది. రేవంత్ మిత్రుడుగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుసుమ కుమార్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు కూడా మొండి చేయే దక్కింది.
హైదరాబాదులో దాదాపుగా 5 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో కుసుమకుమార్ ఎంపిక కలిసొస్తుందని రాష్ట్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. కొన్ని నెలల క్రితం కమ్మ గ్లోబల్ ఫోరం (KGF) సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కుసుమకుమార్ ఆహ్వానించారు. దీంతో కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారవుతుందని అంతా ఊహించారు. కానీ, రాష్ట్ర నాయకత్వం అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, చరణ్ కౌశిక్ రేసులో ఉన్నప్పటికీ.. వారిని కూడా పక్కనపెట్టారు.
కాగా, ఎమ్మెల్యే కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు మార్చి 10వ తేదీలోకా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా మూడు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్ఎస్‌కు వచ్చే అవకాశం ఉంది. ఐదో స్థానం కోసం ఎంఐఎంతోపాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు నాలుగో సీటు లభించే అవకాశమున్నా.. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో వారి వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications