ఆ రైల్వే ప్రాజెక్ట్ ల పనులు నత్తకు నడకలు నేర్పినట్టే.. కారణమిదే!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే తన నెట్వర్క్ ను విస్తరించాలని భావిస్తున్నప్పటికీ, అనేక కారణాలు అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో పనులు ముందుకు సాగడం లేదు. నత్తకు నడకలు నేర్పిస్తున్నట్టు కొన్ని ప్రాజెక్టుల పనులు ఉండడం తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ విస్తరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు అన్న అభిప్రాయానికి కారణంగా మారింది.
రైల్వే నెట్వర్క్ విషయంలో వెనకబడుతున్న తెలంగాణా
భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం రైల్వే నెట్వర్క్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికే మంజూరైన అనేక ప్రాజెక్టులు భూసేకరణ జాప్యం, నిధుల సమస్యలతో ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులు, కొత్త రైల్వే ప్రాజెక్టులపైన ఆశాజనకమైన భావనను కలిగించడం లేదు.

రైల్వే ప్రాజెక్ట్ ల అంచనా వ్యయం 35వేల 45కోట్లు
ప్రస్తుతం కేటాయించిన పనులే జరగకపోవడంతో కొత్త ప్రాజెక్టులకు లాభదాయకం కాదంటూ రైల్వే శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో పనుల పురోగతి కూడా మందగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పరిధిలో ఆరు కొత్త లైన్లు, 14డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి అంచనా వ్యయం 35వేల 45కోట్లు. వీటి మొత్తం పొడవు 2,165కిలోమీటర్లు. అయితే 2025 మార్చినాటికి దాదాపు మూడోవంతు నిధులు మాత్రమే ఈ ప్రాజెక్టులకు ఖర్చయ్యాయి.
పూర్తయిన మార్గాలు ఇవే
11549 కోట్ల రూపాయలను మాత్రమే ఇప్పటివరకు ఖర్చు చేశారు. ఈ అన్ని ప్రాజెక్టులలో ఇప్పటివరకు కేవలం 547 కిలోమీటర్ల మేర మాత్రమే కొత్త రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది.
ఇక నిర్మించవలసిన ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల కొత్త లైన్లలో 245 కిలోమీటర్లు, అలాగే 1326 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్టులలో 303 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటివరకు పూర్తయిన వాటిలో చూసినట్లయితే అక్కన్నపేట- మెదక్, భద్రాచలం- సత్తుపల్లి మార్గాలు ఉన్నాయి.
ఇంకా ఈ మార్గాల్లో భూ సేకరణ
అయితే ఈ ప్రాజెక్టులు వాటా నిధులు చెల్లింపులో ఆలస్యం కారణంగా, భూసేకరణలో జాప్యం కారణంగా ఆలస్యం అవుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణలో చాలా జాప్యం జరిగిందని 2003 హెక్టార్ల భూమికి ఇప్పటివరకు 1580 హెక్టార్ల భూమిని మాత్రమే సేకరించ గలిగారు అని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇంకా భూసేకరణ 764 హెక్టార్లకు పెండింగ్ ఉందని పేర్కొంటున్నాయి.
ఈ చిక్కులతో ప్రాజెక్ట్ లు జాప్యం
ముద్కేడ్ - మేడ్చల్, గుంటూరు- బీబీనగర్, మహబూబ్నగర్ - డోన్ వంటి కీలక డబ్లింగ్ ప్రాజెక్టుల పనులు భూసేకరణ జాప్యం వల్ల తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిరిసిల్ల సమీపంలో 2.1కిలోమీటర్ల అటవీ భూమి బదలాయింపు సమస్యగా మారింది. అయితే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 10.10కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని రైల్వే శాఖ మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ కారణంగానే ఈ పనులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న భూసేకరణ
మరోవైపు యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ కు, గత ప్రభుత్వం మూడింట రెండు వంతుల వ్యయం భరించేందుకు ముందుకు వచ్చిన తగిన నిధులు విడుదల కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు కూడా చాలా సంవత్సరాల పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం నిర్మాణ వ్యయాన్ని భరిస్తామని ప్రకటించింది దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఏది ఏమైనా రకరకాల కారణాలతో వాటాల చిక్కుముడి లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు కొన్ని ముందుకు నడవడం లేదు.












Click it and Unblock the Notifications