తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం: ఎప్పట్నుంచంటే?
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి వరి ధాన్యం 150 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని తెలిపారు. ప్రోత్సాహకంగా సన్న వరిధాన్యం పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం, రూ. 18 వేల కోట్లతో రుణమాఫీ, అన్ని సౌకర్యాలతో ఆధునాతన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని తెలిపారు. సర్వే నెంబర్ 57లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రూ. 200 కోట్లతో నిర్మించుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ స్కూల్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయన్నారు.
గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నవారు కాంగ్రెస్ సభ్యులు కారు.. వీరంతా తమ కుటుంబసభ్యులని అన్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, రేషన్ షాపుల్లో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications