పోలీస్ స్టేషన్లో బయ్యారం బుడతడు; మాస్టారుకే ముచ్చెమటలు పట్టించిన మూడోతరగతి బాలుడు
మహబూబాద్ జిల్లాలోని బయ్యారంలో ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఓ బుడతడు చేసిన పని ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మూడవ తరగతి చదువుతున్న అనిల్ నాయక్ అనే విద్యార్థి తాను చేసిన పనితో టీచర్ కే ముచ్చెమటలు పట్టించాడు. గత కొంత కాలం నుంచి మ్యాథ్స్ టీచర్ తనను కొడుతున్నాడని, మాస్టర్ కొడుతున్న దెబ్బలను తట్టుకోలేక పోతున్నానని ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాస్టర్ పై ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఎస్సై దగ్గరకు వెళ్లి టీచర్ పై ఫిర్యాదు చేసిన బుడతడు
ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన బుడతడు అనిల్ నాయక్ ఎస్ఐ దగ్గరకు నేరుగా వెళ్లి ఎస్ఐ మేడం.. నన్ను సన్నీ సార్ రోజూ కొడతాడంటూ ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా పోలీస్ స్టేషన్లో మాస్టార్ మీద ఫిర్యాదు చేశాడు. మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ మేడంకు విజ్ఞప్తి చేశాడు. చక్కగా మాస్క్ పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన అనిల్ నాయక్ తీరు అక్కడి వాళ్లందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మూడవ తరగతి చదువుతున్న అనిల్ నాయక్ చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా విన్న ఎస్సై రమాదేవి బాలుడు ఫిర్యాదుతో తన సిబ్బందితో కలిసి స్కూల్ కు వెళ్లి విచారణ చేపట్టారు.

స్కూల్ కు వెళ్లి విచారించిన పోలీసులు.. టీచర్లకు హితవు
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన మాస్టార్లు సహనం కోల్పోవద్దు అని, విద్యార్థులకు ఓపికతో చదువు చెప్పాలని స్కూల్ టీచర్లకు పోలీసులు హితవు పలికారు. విద్యార్థితో కూడా మాట్లాడిన వారు విద్యార్ధి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సహజంగా పోలీసులు అంటేనే భయపడిపోయే చిన్నపిల్లలు, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎలాంటి భయము లేకుండా ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. అయితే అనిల్ నాయక్ చేసిన పనితో టీచర్లకు మాత్రం ఇక నుండి విద్యార్థులను కొట్టాలంటే కేసుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

గతంలోనూ పెన్సిల్ కోసం ఫ్రెండ్ పై కేసు పెట్టమన్న బుడతడు
అంతకుముందు కర్నూలు జిల్లా పెద్దకడబూరు లోనూ ఇద్దరు స్నేహితుల మధ్య పెన్సిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిన విషయం తెలిసిందే. తన బ్యాగ్ నుంచి స్నేహితుడు పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడు అంటూ, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఓ బుడతడు ఫిర్యాదు చేశాడు. స్నేహితుడి పై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. అప్పుడు అతని సముదాయించి పంపటం పోలీసులకు పెద్ద పనే అయింది. ఇప్పుడు తాజాగా ఏకంగా టీచర్ తనను కొడుతున్నాడు టీచర్ పైనే మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications