ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం: వందలాది మందిని కాపాడింది ఇతడే
హైదరాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందర్నీ కాపాడిన యువకుడి వివరాలు తెలిశాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైన్ లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అతడే పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన సిగిల్ల రాజు. ఐడీఏ బొల్లారంపుర పరిధి లక్ష్మీనగర్‌లో కుటుంబీకులతో పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను రాజు వెల్లడించాడు. ఒడిశాలోని పర్లాకిమిడికి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కామని తెలిపాడు. తాను, తన అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఎస్4 బోగీలో కూర్చున్నట్లు చెప్పాడు.

జులైన 7న ఉదయం 11 గంటల సమయంలో పై బెర్తులో పడుకొన్న రాజుకు ఒక్కసారిగా రబ్బరు కాలిన వాసన వచ్చింది. దీంతోపాటు ట్రైన్ పై భాగం నుంచి వేడిగా అనిపించడంతో ఎండ వల్లనేమోనని తొలుత అనుకున్నాడు. అంతలోనే వాసన మరింత ఎక్కువవడంతో కిందికి దిగి కిటికీలోంచి చూస్తూ రైలు నుంచి దట్టమైన పొగ రావడం గమనించాడు.
వెంటనే చైన్ లాగిన రాజు కేకలు వేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం అందిచాడు. ప్రమాద కేంద్రం రాజు కుటుంబం కూర్చున్న బెర్తు వద్దనే ఉండటంతో కుటుంబాన్ని తొలుత కిందకి దించాడు. అలాగే తోటి ప్రయాణికులను కూడా సహకరిస్తున్న క్రమంలో పొగను ఎక్కువగా పీల్చడంతో రాజు స్పృహతప్పి పడిపోయాడు.
అశ్వస్థతకు గురైన వారందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు స్పృహలోకి రావడంతో.. రాత్రి 11 గంటలకు ఐడీఏ బొల్లారంలోని ఇంటికి చేరుకున్నట్లు తెలిపాడు రాజు. తాను చైన్ లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అంతా రైలు దిగారని.. మరో ఐదారు నిమిషాలు ఆలస్యమైతే ప్రాణనష్టం జరిగేదని చెప్పాడు. బాగా పొగ పీల్చడంతో ప్రస్తుతం తనకు నీరసంగా ఉందని, ఛాతిలో నొప్పి వస్తుందని వాపోయాడు రాజు. చికిత్స కోసం ఏ అధికారీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications