ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం: షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత షబ్బీర్ అలీకి శుక్రవారం నాడు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామని అతనికి బెదిరింపులు వచ్చాయి.
దీంతో షబ్బీర్ అలీ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అతనికి ఓ ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది. షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్ రావడం చర్చనీయాంశమైంది.

టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు
తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన వారిలో ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ధనదాహంతో గెలవాలనుకుంటోందన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధి కోరుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకగ్రీవానికి సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications