నైజీరియన్ల ఆన్‌లైన్ మోసాలు: వ్యాపారి, మహిళా ప్రొఫెసర్ నుంచి 39లక్షల దోచారు
హైదరాబాద్: నగరంలో నైజీరియన్లు మోసాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ వ్యాపారికి మహిళ పేరుతో `ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసి వల వేశారు. అతని నుంచి ఏకంగా రూ. 36లక్షలను దోచుకున్నారు.
మరో ఘటనలో బ్రిటన్‌లో సెమినార్ ఉందంటూ ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి రూ. 2.82లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్‌లో ఓ అందమైన మహిళ తన ఫొటో అప్‌లోడ్ చేసి, తన పేరు కైరా జస్టిన్ అని, అమెరికాలో ఉంటానని నగరానికి చెందిన డేవిడ్ నరోనా పాయస్‌తో పరిచయం పెంచుకుంది.
తాను అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ ముంబై నుంచి బిమెక్టిన్ హెర్బల్ ఆయిల్‌ని ఒక లీటరు 28వేల అమెరికన్ డాలర్లకే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ముంబైలో అయితే.. అది లీటరు 15వేల అమెరికన్ డాలర్లకే దొరుతుందని చెప్పింది. అక్కడ కొనుగోలు చేసి తమ కంపెనీకి సరఫరా చేస్తే ఇద్దరికీ మంచి లాభాలు మిగులుతాయని నమ్మబలికింది.
ఇతర వివరాల కోసం www.skmgroupint.comఅనే వెబ్‌సైట్ చూడాలని సలహా ఇచ్చింది. ఆ వెబ్‌సైట్ ద్వారా ముంబైలోని ఎస్కే మార్ట్ ట్రేడింగ్ గ్రూప్‌ను సంప్రదించిన బాధితుడు.. 8 దఫాలుగా వారికి రూ. 36.19లక్షలు చెల్లించారు.

ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే అందమైన మహిళ ఫొటోతో నైజీరియన్ల ముఠానే ఈ మోసానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఓ మహిళా ప్రొఫెసర్‌ను కూడా ఓ నైజీరియన్ ముఠా మోసం చేసింది. దేశంలోని ప్రముఖ అగ్రికల్చర్ యూనివర్సిటీలను ఎంచుకుని.. ఆయా వర్సిటీలకు ‘రిసోర్సెస్' అండ్ క్లైమెట్ చేంజెస్' పేరిట బ్రిటన్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనున్నట్లు సందేశం పంపారు. ఆసక్తిగల అధ్యాపకులు నేరుగా తమ రెజ్యూమే, వ్యక్తిగత సమాచారాన్ని పంపమంటూ ప్రత్యేక మెయిల్ ఐడీ పంపించారు.
ఈ సమాచారం నిజమని నమ్మి జగిత్యాలలోని ఓ వ్యవసాయ అనుబంధ పరిశోధన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఓ మహిళ.. తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ జూలై 31న రెజ్యూమె, పరిశోధనకు సంబంధించిన వివరాలను పంపారు. మరుసటి రోజు ఆమె మెయిల్‌కు బ్రిటన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ వివరాలతో కూడిన సమాచారం వచ్చింది.
లండన్‌లోని రాయల్ క్రౌన్ హోటల్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు కొంత సొమ్ము చెల్లించాలని మెయిల్‌లో పేర్కొన్నారు. సెక్యూరిటీ డిపాజిట్, ఇన్స్యూరెన్స్, పబ్లికేషన్, ప్రజేంటేషన్ ఖర్చుల కోసమని చెబుతూ దఫాల వారీగా రూ. 2.82లక్షలను కాజేశారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత మహిళా ప్రొఫెసర్ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు జరిపారు. నిందితులైన టామీ మ్యాక్(28), మార్వలెస్ మెజ్రే ఒకోఫర్(24) అనే నైజీరియన్లతోపాటు మణిపురికి చెందిన హెంకోచొన్ హోకిప్(25)ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications