తిరుపతి లడ్డు కల్తీ బాధాకరం: పవన్‌కు చిలుకూరు టెంపుల్ అర్చకులు రంగరాజన్ మద్దతు
హైదరాబాద్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. భయంకరమైన, నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు.
టెండరింగ్ ప్రక్రియే తప్పు అని రంగరాజన్ విమర్శించారు. నిజానిజాలపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లుగా జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నవారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రను కాపాడాలని రంగరాజన్ కోరారు.

సీబీఐ విచారణ జరపాలన్న వీహెచ్
తిరుమల శ్రీవారి లడ్డూలో నాసిరకం నెయ్యి వాడినట్లు తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు చెప్పారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసాదంలో పంది, చేప కొవ్వు వాడినట్లు తేలిందన్నారు. నెయ్యి సరఫరాను రెగ్యులర్ కాంట్రాక్టర్ కు కాకుండా కొత్త వాళ్లకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదన్నారు వీహెచ్. కల్తీ నెయ్యి వాడిన వాళ్లను దేవుడు కూడా క్షమించడని అన్నారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దేవుడికి అన్యాయం జరిగిందని.. ఏ పార్టీ అయినా విచారణ జరగాల్సిందేనని వీహెచ్ స్పష్టం చేశారు.
కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వినియోగిస్తున్నట్లుగా ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు-NDDB) నివేదిక తేల్చడం గమనార్హం.












Click it and Unblock the Notifications