కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నవారికి 2 లక్షల జీవిత బీమా.. ఆ పనిచేస్తే రాహుల్ గాంధీతో సన్మానం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా రెపరెపలాడాలని కాంగ్రెస్ శ్రేణులకు హితబోధన చేస్తున్నారు. ప్రతి కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి 2 లక్ష జీవిత బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతి కార్యకర్తకు అండగా..
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు అండగా ఉండే పార్టీ అన్నారు టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి భద్రత, ధీమా కల్పించేందుకు రూ. 2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కార్యకర్తలకు ఈ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2 లక్షల బీమా
పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 2 లక్షలు అందిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రమాదంలో ఏవైనా అవయవాలు దెబ్బతింటే తీవ్రతను బట్టి పరిహారం అందిచనున్నట్లు తెలిపారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వనున్నట్లు వివరించారు. ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ఈ-సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును తొలుత జనవరి 26 వరకు పూర్తి చేయాలని అనుకున్నామని తెలిపారు. కానీ, కరోనా వల్ల మరి కొంత గడువు పెంచుకున్నామని పేర్కొన్నారు..

వారికి రాహుల్ గాంధీతో సన్మానం
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 7 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 100 మందిని కాంగ్రెస్ కుటుంబంలో చేర్పించేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. బూత్‌లలో ఎక్కువ మందిని సభ్యత్వాలు నమోదు చేయించిన వారిని గాంధీభవన్‌కు పిలిచి స్వయంగా సన్మానిస్తామని తెలిపారు. అదే విధంగా మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ స్థాయిలో 50 వేలు, పార్లమెంట్ స్థాయిలో మూడున్నార లక్షల సభ్యత్వం చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications