ఆ సింగరేణి గనుల వేలాన్ని ఆపండి: ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ, సమస్యల విన్నపం
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గనులలో నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోవాలని ప్రధానిని కోరారు. సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, వాటిని SCCL(సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్)కి కేటాయించాలని అభ్యర్ధించారు.

అప్పుడు కూడా సింగరేణిలో బొగ్గు నిల్వలు: రేవంత్
బొగ్గు విక్రయం కోసం బొగ్గు గనుల వేలం కోసం 3వ విడతలో సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మీ(ప్రధాని) దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అన్నారు రేవంత్ రెడ్డి. అక్టోబర్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక పవర్ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయి. కానీ తెలంగాణలోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) నుంచి తగినంత బొగ్గు సరఫరా కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది. SCCL అనేది 51:49 ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం జాయింట్ వెంచర్. ఇది ఇప్పుడు 45 గనుల నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. 1200 MW (2X600) MW పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. 2019-20లో ఉత్పత్తి చేయబడిన 64.02 Mt బొగ్గులో, దక్షిణ ప్రాంతంలోని విద్యుత్ పరిశ్రమకు సుమారు 52.95 Mt అందించబడింది. 2023-24 నాటికి 80 మెట్రిక్ టన్నులకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్పత్తిలో దాదాపు 80శాతం విద్యుత్ పరిశ్రమకు వెళ్తుంది అని రేవంత్ రెడ్డి తన లేఖలో వివరించారు.

ఆ నాలుగు గనుల వేలాన్ని ఆపండి: ప్రధానికి రేవంత్
విద్యుత్ ప్లాంట్ల ద్వారా థర్మల్ బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు అదనంగా 11 MTY బొగ్గును ఉత్పత్తి చేయాలని SCCL ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న గనులు/మైనింగ్ లీజుల పొడిగింపు అనేది అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, నిల్వల పరిరక్షణ కోసం మాత్రమే సాంకేతికంగా సాధ్యమవుతుంది. ఇప్పటికే ఉన్న గనుల విస్తరణ ఈ 4 బొగ్గు బ్లాకుల పరిధిలోకి వస్తుంది
1) కోయగూడెం బ్లాక్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
2) సత్తుపల్లి బ్లాక్- ఖమ్మం జిల్లా
3) శ్రావణపల్లి- మంచిర్యాల జిల్లా
4) కళ్యాణి బ్లాక్ - మంచిర్యాల
బొగ్గు అమ్మకం కోసం బొగ్గు గనుల వేలం కోసం 3వ విడతలో సింగరేణి కాలరీస్‌లోని ఈ నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది, 12.10.2021 తేదీ నోటిఫికేషన్ ప్రకారం, అన్ని వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. సత్తుపల్లి నుంచి బొగ్గు ఉత్పత్తి తరలింపునకు కోయగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ వేయడానికి సుమారు రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టడంతోపాటు పై ప్రాంతంలో అన్వేషణలో సుమారు 70 కోట్లు పెట్టుబడి పెట్టడం వల్ల SCCLకి భారీ నష్టం వాటిల్లుతుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కార్మికులు ఆందోళన చెందుతున్నారు: రేవంత్
ఈ ప్రాంతంలో వేలాది మంది నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి కల్పించే ఏకైక ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ SCCL కాబట్టి ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆందోళన కలిగించింది. గని కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను వ్యతిరేకిస్తూ వారు 09/12/2021, గురువారం నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. పైన పేర్కొన్న బొగ్గు గనులను వేలం వేయడానికి అలాంటి ఏదైనా నిర్ణయం ఈ ప్రాంతంలో బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది, కోవిడ్ సమయంలో కార్మికులకు జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి, MMDR చట్టం, 1957లోని సెక్షన్ 1 IA కింద పేర్కొన్న నాలుగు బ్లాక్‌ల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని, వాటిని SCCLకి బదిలీ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల మర్చారు: రేవంత్ ఫైర్
ఇది ఇలావుండగా, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఏడేళ్లయినా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం సచివాలయం ఎదుట నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్మారక భవనాన్ని రేవంత్ పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, భూమి, ఒకరికి ఉద్యోగం ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం 2017లో రూ. 80 కోట్లు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం.. 2018లో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. టీ హబ్ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని కాగ్ చెప్పిన అదే సంస్థకు ప్రభుత్వం నిర్మాణ పనులను అప్పగించిందని ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన గుత్తేదారుకు పనులు అప్పగించినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications