వేములవాడలో విషాదం... ఉదయం తండ్రి,రాత్రి కుమారుడు... బలి తీసుకున్న కరోనా...
భారత్‌లో కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్‌లో ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరినుంచి ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి అందరినీ వెంటాడుతోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగించే అంశం. కొంతమందిలో కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే వైరస్ లక్షణాలు తీవ్రమై మరణం సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు సైతం కరోనాతో మృతి చెందుతుండటం చాలా కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఓ తండ్రీకొడుకులు కొన్ని గంటల తేడాతో కరోనాతో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది.

వేములవాడకు చెందిన టీచర్...
వేములవాడ పట్టణానికి చెందిన గుమ్మడి ప్రకాశ్(45) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య మధురిమ,కుమారులు అభయ్,అభిజిత్ ఉన్నారు. మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయటపడటంతో కుటుంబమంతా కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో అందరికీ పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ప్రకాశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. ఆయన భార్య,పిల్లలు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.

ఉదయం తండ్రి... రాత్రి కుమారుడు...
రెండు రోజులుగా కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశ్... మంగళవారం(మే 5) తెల్లవారుజామున మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రకాశ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రకాశ్ మరణవార్త నుంచి తేరుకోక ముందే ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశ్ కుమారుడు అభిజిత్(18) మంగళవారం(మే 5) రాత్రి మృతి చెందాడు. కొన్ని గంటల తేడాతోనే ఒకే తండ్రీ కొడుకులు కరోనాతో మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.

కొనసాగుతున్న కరోనా ఉధృతి...
తెలంగాణలో కరోనా ఉధృతి నేపథ్యంలో కొన్ని పట్టణాల్లో వర్తక వ్యాపారులు స్వచ్చందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి,చెన్నూర్,మందమర్రి మున్సిపాలిటీల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది. కరోనా కేసుల విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,527కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 3,89,491 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,225 కరోనా కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications