కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం !
హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక గోకులేనగర్‌లో ఆదివారం ( ఆగస్టు 17, 2025) అర్ధరాత్రి.. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రాత్రి ఊరేగింపు చేపట్టారు. అయితే ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందడం సర్వత్రా కలకలంగా మారింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..?
కృష్ణాష్టమి శోభాయాత్రలో భాగంగా ఊరేగింపు రథాన్ని లాగుతూ తీసుకెళ్తుండగా, దానిని లాగుతున్న వాహనం అకస్మాత్తుగా దెబ్బతింది. దీంతో పక్కన నిలిపిన రథాన్ని కొంతమంది యువకులు స్వయంగా చేతులతో లాగుతూ ముందుకు నడిపారు. ఈ సమయంలో రథం ఎత్తు కారణంగా అది పైభాగంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. వెంటనే రథాన్ని తోసుతున్న తొమ్మిది మందికి షాక్ తగలడంతో వారు ఒక్కసారిగా ఎగిరిపడి నేలపై పడిపోయారు.

స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
మృతులుగా గుర్తించిన వారు:
కృష్ణ యాదవ్ (24)
సురేష్ యాదవ్ (34), తండ్రి వెంకటయ్య
శ్రీకాంత్ రెడ్డి (35), తండ్రి ఆంజిరెడ్డి
రుద్ర వికాస్ (39)
రాజేంద్ర రెడ్డి (45)
ఈ మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రథం ఊరేగింపులో భద్రతా చర్యలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications