కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం.. దుఃఖ సాగరంలో కిషన్ రెడ్డి కుటుంబం!!
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి బిజెపి సీనియర్ నాయకుడు అయిన కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఈ మరణ వార్త తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా సమాచారం. ప్రస్తుతం నోయిడాలో ఉన్న కిషన్ రెడ్డి మేనల్లుడు అకారణ మరణంతో హైదరాబాద్ కు బయలుదేరారు.
కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి ఇంట్లోనే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కంచన్ బాగ్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మృతి చెందారు. దీంతో కిషన్ రెడ్డి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. కిషన్ రెడ్డి అక్క లక్ష్మి, బావ నరసింహారెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి. కిషన్ రెడ్డి అక్క, బావ కుటుంబం ప్రస్తుతం సైదాబాద్ వినయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

ఇక మృతి చెందిన జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక కిషన్ రెడ్డి మేనల్లుడు మరణ వార్త తెలియగానే పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కిషన్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జీవన్ రెడ్డి హఠాన్మరణం తో మేనల్లుడిని కోల్పోయానన్న ఆవేదనలో కిషన్ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications