ఓటేసిన ట్రాన్స్ జెండర్లు.. మీరు ఓటెయ్యలేరా అంటూ సూటిప్రశ్న!!
ఎన్నికల పండుగలో ట్రాన్స్ జెండర్ లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజంలో వివక్షకు గురవుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చాలా మంది ట్రాన్స్ జెండర్ లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మేము సైతం అంటున్నారు. వరంగల్ నగరంలో ఉన్న 338 మంది ట్రాన్స్ జెండర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వరంగల్లో ఉన్న ట్రాన్స్ టెండర్లు చెబుతున్నారు. సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని తామే ఓటు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకున్నామని, బద్దకించి టీవీలు చూస్తూ ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ట్రాన్స్ టెండర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి ఏవో హామీలు ఇస్తారని, మేనిఫెస్టో లోను అనేక అంశాలను పెడతారని, వివిధ వర్గాల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న రాజకీయ నాయకులు, ట్రాన్స్ టెండర్ల సంక్షేమాన్ని మరిచిపోతున్నారని ట్రాన్స్ టెండర్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి ఓటు హక్కును వినియోగించుకున్నామని, భారతదేశ పౌరులుగా ఓటేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాన్స్ జెండర్ లు చెబుతున్నారు.
మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ట్రాన్స్ జెండర్ లు కోరుతున్నారు. ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గుర్తు చేశారు.
ఓటేసిన ట్రాన్స్ జెండర్లు.. ఓటు మీరెయ్యలేరా అంటూ ప్రశ్న..!!#TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TSAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/IXur7EF5lz
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2023
చదువుకున్న చాలామంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, ఇది మన రాజ్యాంగ వ్యవస్థకు చేటు చేస్తుందని ట్రాన్స్ టెండర్ లైలా తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తామంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని పేర్కొన్న లైలా, డబ్బుకు , మద్యానికి ప్రలోభ పడకుండా అందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏ రాజకీయ పార్టీలు గుర్తించకపోయినా, తమ సంక్షేమానికి ఎవరు ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా తామంతా సమిష్టిగా ఓటు వేశామని, మరి మీరు ఓటు వేశారా అని ప్రశ్నిస్తున్నారు. మేమే ఓటేయగా లేనిది.. మీరు ఎందుకు ఓట్ వేయలేరు అంటూ ఓటింగ్ పై ఆసక్తి చూపించని ఓటర్లను ట్రాన్స్ జెండర్ లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications