బండి సంజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన కవిత.. ప్రధాని మోదీకి లేఖ!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు టీఆర్ఎస్ అధినేత్రి కవిత బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసుపై ప్రధాని మోడీకి కవిత లేఖ
లేఖలో కవిత ఈ కేసు అత్యంత తీవ్రమైనదని, మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల కేసు కావడంతో దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండటం వల్ల దర్యాప్తు అధికారులు, సాక్షులు, సాక్ష్యాల సేకరణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కేసు దృష్ట్యా మంత్రి స్థాయి పదవిలో కొనసాగడం కరెక్ట్ కాదు
పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్ కుమారుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇలాంటి సున్నితమైన కేసులో ఆయన కొడుకు ఉండటం వలన మంత్రి స్థాయి వ్యక్తి పదవిలో కొనసాగడం వల్ల న్యాయవ్యవస్థ సమగ్రతపై ప్రజల్లో అనుమానాలు ఏర్పడే ప్రమాదం ఉందని కవిత హెచ్చరించారు.
ప్రధాని మోదీ తక్షణ కర్తవ్యమిదే
దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదన్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం అందాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకం కాపాడాలంటే విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు అని లేఖలో కవిత పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజ్యాంగ నిబద్ధత, నైతిక విలువలను కాపాడటం ప్రధాని మోదీ తక్షణ కర్తవ్యమని కవిత గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని కవిత డిమాండ్
కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఇలా చేయడం ద్వారా దర్యాప్తు ఏ విధమైన ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా జరుగుతుందని ఆమె వివరించారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత రాసిన ఈ లేఖపై ప్రధాని మోదీ ఎలాంటి చర్య తీసుకుంటారనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













Click it and Unblock the Notifications