టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. పట్టపగలే గొడ్డళ్ళతో నరికి చంపిన ఘటన
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానుకోట మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్ బానోతు రవిని గుర్తుతెలియని దుండగులు పట్టపగలే దారుణంగా హత్య చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక కాలనీలో రవి బైక్ పై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రవికి అడ్డుగా వచ్చిన దుండగులు ఊహించని విధంగా రవి పై దాడి చేశారు. అతి కిరాతకంగా గొడ్డళ్ళతో నరికి హతమార్చారు.

మహబూబాబాద్ లో టీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్ దారుణ హత్య
మహబూబాబాద్ లో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా ఉన్న బానోతు రవి నాయక్ పత్తిపాక లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి పనులను పరిశీలించడానికి వెళుతున్న క్రమంలో ఆయనపై దాడి జరిగింది. పత్తిపాక లో రవి బైక్ వెళుతుండగా కాపు కాసిన దుండగులు అతనిపై గొడ్డలితో దాడి చేయడంతో రవి తీవ్ర గాయాల పాలయ్యాడు. దాడి జరుగుతున్న సమయంలో రవి ఒక్కడే బైక్ పై ఉన్నాడు. దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రవి నాయక్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

గొడ్డళ్ళతో దాడి చేసి విచక్షణారహితంగా నరికిన దుండగులు
ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేసే సమయానికే రవి నాయక్ ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్యులు తెలిపారు. రవి పై గొడ్డళ్ళ తో దాడి చేసిన దుండగులు రవి తీవ్రంగా గాయపరిచిన తర్వాత అక్కడి నుండి పరారయ్యారు. బానోతు రవి హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న ఆధారాలను సేకరించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తనకు ప్రాణహాని ఉందని మిత్రుల వద్ద ఆవేదన..కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన కౌన్సిలర్ ను పట్టపగలు నడిరోడ్డుపై మీద అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన పై స్థానికంగా చర్చ జరుగుతుంది. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా రవి నాయక్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా సమాచారం. రవి నాయక్ భార్య పూజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
హత్య జరగటానికి కొద్ది గంటల ముందు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రవి నాయక పాల్గొన్నారు. రవి నాయక్ ను అంత దారుణంగా హతమార్చవలసిన అవసరం ఎవరికి ఉంది. వ్యక్తిగత కక్షలా, కుటుంబ వివాదాలా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవి నాయక్ కుటుంబాన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications