TRS అనుకున్నదే జరుగుతోందా?
తమ గుర్తును పోలిన గుర్తులతో నష్టం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. గతంలో ఎన్నికల సమయంలో తమకు ఎదురైన అనుభవాలను ఈసీకి వివరించింది. తాజాగా రౌండ్ రౌండ్ కు వెల్లడవుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత పెంచుకుంటూ వెళుతోంది. టీఆర్ఎస్ భయపడినట్లే ఆ గుర్తులకు కూడా ఓట్లు పడుతున్నాయి.
6 రౌండ్లు పూర్తయ్యేసరికి తెలంగాణ రాష్ట్ర సమితి భయపడిన గుర్తులకు 818 ఓట్లు వచ్చాయి. కారు గుర్తును పోలిన రోటీమేకర్ గుర్తుకు 4 రౌండ్లకు 483 ఓట్లు వచ్చాయి. అలాగే రోడ్ రోలర్ గుర్తుకు 335 ఓట్లు వచ్చాయి. మిగిలిన రౌండ్లలోను ఇదే సంఖ్యలో ఓట్లు పడతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈసీకి టీఆర్ఎస్ 8 గుర్తులపై ఫిర్యాదు చేసింది. కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, టీవీ, కుట్టుమిషన్, సబ్బు డబ్బా, ఓడ గుర్తులను తొలగించాలని కోరింది.

2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్‌ఎస్ ఆధారాలతో సహా చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా స్వతంత్రంగా పోటీచేసిన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని, కారును పోలిన గుర్తులు ఉన్న కారణంతోనే ఓట్లు పడ్డాయని నాయకులు స్పష్టం చేస్తున్నారు.
2018 ఎన్నికల్లో మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ స్థానాల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని, నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ చెబుతోంది.












Click it and Unblock the Notifications