
కేసీఆర్ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి.. నిర్మలా సీతారామన్‌ను నిలదీసిన కవిత
కేంద్ర బడ్జెట్ 2022-23 పై ప్రతిపక్షాలు విరుకుపడుతున్నాయి. ఈ బడ్జెట్‌తో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం సంస్థలను తమ అనుచరులకు అమ్మడమే పనిగా పెట్టుకుందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడుతున్నాయి. కరోనా కష్టకాలంలో చితికిన ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి.. వారి జీవితాలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడుతున్నాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి.

కేంద్రంపై కవిత నిప్పులు
తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసీ )ని అమ్మాల్సిన అవసరం ఎందుకు అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ట్విట్టర్ వేదికగా కవిత డిమాండ్ చేశారు.
ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?
సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి నిర్మలా సీతారామన్ గారూ అంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటి అని నిర్మలా సీతారామన్‌ను కవిత ప్రశ్నించారు.

మోదీ ప్రభుత్వానికి అమ్మడమే తెలుసు..
మోదీ ప్రభుత్వానికి అమ్మడం, మత ద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసంటూ కేంద్ర బడ్జెట్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బడ్జెట్‌తో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఇప్పుడు కొత్తగా ఎల్ఐసీని అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంతర్జాతీయంగా ఎంతో గొప్ప పేరుతో పాటు.. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ సంస్థను సిగ్గు లేకుండా అమ్ముతున్నారని మండిపడ్డారు. అంత మంచి సంస్థను ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలి అని కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఆ వీడియోను కవిత ట్విట్లర్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ ప్రశ్నకు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుత్తిలేకుండా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.