టీఆర్ఎస్ సీనియర్ నేత రాజీనామా; నా బాటలోనే చాలామంది; బాధతప్ప భవిష్యత్ లేదన్న రాజయ్య
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి 22 సంవత్సరాల నుండి కీలకంగా పనిచేసిన నేత రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది అధినేత కేసీఆర్ కు షాక్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గా పనిచేసిన కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత రాజయ్య యాదవ్
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తో కలిసి పోరాటం చేసిన నాయకులలో రాజయ్య యాదవ్ ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసి కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్ట్ అయ్యి ఖమ్మం జైల్లో కేసీఆర్ తో పాటు ఉన్న నాయకులలో రాజయ్య యాదవ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఆయనను పార్టీ పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన తాజాగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

టీఆర్ఎస్ తో ఉన్న 22 సంవత్సరాల అనుబంధానికి నేటితో గుడ్ బై
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ వెంట ఉన్న సీనియర్ నాయకుడైన ఆయన టిఆర్ఎస్ పార్టీ తో తనకున్న 22 సంవత్సరాల అనుబంధానికి నేటితో స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ఇంతకాలం టిఆర్ఎస్ పార్టీలో ఉండి తాను అనుభవించిన బాధ నుండి నేటితో విముక్తి పొందుతున్నాను అని మాజీ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ వెల్లడించారు. ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీలో పని చేశానని, టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా,మెదక్ జిల్లా ఇన్చార్జిగా,గజ్వెల్ ఇన్చార్జిగా పనిచేశానని చెప్పిన ఆయన, ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేసిన వారికి పార్టీ అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ లో ఇప్పుడు ఉద్యమకారులు లేరు
కెసిఆర్ తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని కానీ ఎందుకు ఇవ్వలేదు తనకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని పేర్కొన్నారు . టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్న వారిలో ఉద్యమకారులు లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులకు టిఆర్ఎస్ లో భాద మిగులుతుంది తప్ప భవిష్యత్తు లేదంటూ సలహా ఇచ్చారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసి ఇప్పుడు తల దించుకొని బతకాల్సిన అవసరం లేదని, కాళ్లు మొక్కి బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదని రాజయ్య యాదవ్ వెల్లడించారు.

కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి మంత్రులు .. వాళ్ళకేం బాధ
కెసిఆర్ ఇంటి నుండి ముగ్గురికి మంత్రుల పదవులు ఉన్నాయని, వాళ్లకేమి బాధ ఉంటుందంటూ పేర్కొన్న రాజయ్య యాదవ్, ఉద్యమ కాలం నుండి పనిచేసిన వారికి పార్టీలో గౌరవం దక్కటం లేదని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీలో ఇంత కాలం పని చేసినందుకు కనీసం పలకరించేవారు కూడా లేని పరిస్థితి ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన బాటలోనే చాలామంది నాయకులు టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారని, వారంతా పార్టీ నుండి బయటకు వస్తారు అంటూ రాజయ్య యాదవ్ వెల్లడించారు.

తెలంగాణా ఉద్యమకారులు తనతో కలిసి రావాలన్న రాజయ్య యాదవ్.. బీజేపీలో చేరే ఛాన్స్
ప్రాణం ఉన్నా లేకున్నా ఆత్మగౌరవం ముఖ్యమని పేర్కొన్న ఆయన తెలంగాణ ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి రావాలని, ఉద్యమకారులంతా ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇక త్వరలో తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని రాజయ్య యాదవ్ వెల్లడించారు. ఇక రాజయ్య యాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications