నిలిపేస్తారా? వాటా ఇస్తారా?: తెలంగాణ అల్టిమేటం, ధీటు లేఖకు ఏపీ రె'ఢీ'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి లేఖల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా నదిలోకి ఎత్తిపోయడంపై తెలంగాణ ఇప్పటికే పలు దఫాలు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏపీ ప్రభుత్వానికి, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు, కేంద్రానికి లేఖలు రాసింది. తాజాగా, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు మరో లేఖ రాసింది.

పట్టిసీమ పథకంతో తెలంగాణకు తీవ్ర నీటి కష్టాలు వస్తాయని, ఈ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తోడితే, తెలంగాణ పరిస్థితి ఏంటని ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖలో ప్రశ్నించింది.
పట్టిసీమ ప్రాజెక్టు సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై ముందుకు సాగితే, కృష్ణా నీటిలో తమ వాటాను పెంచాలని డిమాండ్ చేసింది. నదీ జల వివాద ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను శిరసా వహిస్తూ, సమాఖ్య స్ఫూర్తితో మెలగాలని ఏపీకి సూచించింది.
పట్టిసీమ పథకం పనులను నిలిపివేయాలని కోరింది. కాగా, దీనిపై గట్టిగానే సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
పట్టిసీమ నిర్మాణం నేపథ్యంలో తమకు కృష్ణా, గోదావరి నీటిలోను వాటా ఇవ్వాలని తెలంగాణ సర్కారు చెబుతున్న విధంగానే, అదే సహజ సూత్రాన్ని ఏపీ విషయంలోను పాటించాలంటూ ప్రత్యుత్తరమిచ్చేందుకు ఏపీ సిద్ధమవతోందని తెలుస్తోంది.
కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇస్తారా? అని అడగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు అక్టోబర్ 7న భేటీ కానుందని సమాచారం.












Click it and Unblock the Notifications