ప్రధాని మోదీ పైనే రేవంత్ ఆశలు - పథకాల అమలు కష్టాలు, ఉక్కిరి బిక్కిరి..!!
తెలంగాణ ప్రభుత్వం కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ 7న కొలువు తీరిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రూ 1,400 కోట్ల మేర రుణం తీసుకుంది. వచ్చే మూడు నెలల కాలంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ 13 వేల కోట్ల రుణ సేకరణకు నిర్ణయించారు. ఇక గ్యారెంటీల అమలుకు ఆర్దిక సర్దుబాటు ప్రభుత్వానికి పరీక్షగా మారుతోంది. మరో వైపు లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీంతో, ఇప్పుడు రేవంత్ కేంద్రం వైపు చూస్తున్నారు.
ఆర్దిక కష్టాలు: తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని ఆర్దిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన రేవంత్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా ప్రజల ముందు ఉంచింది. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల అమలు ఇప్పుడు రేవంత్ కు సవాల్ గా నిలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పట్టు కొనసాగాలంటే ఈ పథకాలు అమలు కీలకంగా మారనుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో బడ్జెట్ లక్ష్యం మేరకు రుణ సేకరణ నాలుగు నెలల ముందే దాదాపు పూర్తయింది. దీంతో, ప్రస్తుత ప్రభుత్వానికి రుణ సేకరణ కష్టంగా మారుతోంది.
పూర్తయిన రుణ పరిమితి: ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2023-24) లో రూ 38,234 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నట్లు బడ్జెట్ లో గత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపాదించిన రుణాలను ఆర్దిక సంవత్సరం ముగిసేలోగా సేకరించటం సాధారణం జరిగే ప్రక్రియ. అయితే, అసెంబ్లీ ఎన్నికల వేళ ముందుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రుణ సదుపాయం వినియోగించుకుంది.
ఎనిమిది నెలల కాలంలోనే గత ప్రభుత్వం రూ 38,151 కోట్ల రుణాలను తీసుకుందని కాగ్ వెల్లడించింది. దీంతో, రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే రూ 1,400 రుణం సేకరించింది. వీటితో కలిపితే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా రూ 39,551 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

కేంద్రం సడలింపు ఇస్తేనే: దీంతో, కొత్తగా రుణాలు సేకరించాలంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలకు అన్వేషిస్తోంది. ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే రుణ పరిమితి నిబంధనలను కేంద్ర ఆర్దిక శాఖ సడలిస్తేనే మార్చి వరకు కొత్త రుణాలు తీసుకోవటానికి రేవంత్ ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు కోరుతూ కేంద్రానికి వినతులు వస్తాయి. వీటిని కేంద్రం సైతం సానుకూలంగా పరిశీలిస్తుంది.
తాజాగా ప్రధానితో సీఎం రేవంత్, భట్టి సమావేశమయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం నుంచి సహకారం తీసుకోవటంలో ఎలాంటి బేషజాలకు పోమని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు తెలంగాణ కు ఆర్దికంగా వెసులుబాటు కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications