హైకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: నిందితులకు షరతులు, వాయిదా
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనే కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారించిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది.
ఈ కేసులు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉన్న న్యాయస్థానంలో సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను శనివారానికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. అయితే, నిందితులకు పలు షరతులు విధించింది.

నిందితులు 24 గంటలపాటు హైదరాబాద్ విడిచి వెళ్లద్దని, ముగ్గురు నిందితులు కూడా శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతేగాక, ఈ కేసుతో సంబంధం ఉన్న రోహిత్ రెడ్డితోపాటు ఇతరులతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, డబ్బులు కూడా దొరకనందున.. నిందితులకు రిమాండ్ విధించలేమని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిందితులకు వెంటనే విడుదల చేసి.. 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని సూచించారు. దీంతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ కు ఇప్పటికే పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయంపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా.. శనివారానికి వాదా వేసింది.












Click it and Unblock the Notifications