"గృహజ్యోతి" పథకం అమలయ్యేది వీరికే - ముహూర్తం, మార్గదర్శకాలు ఖరారు..!!
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు ముహూర్తం ఖరారైంది. నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. పథకం అర్హులను తేల్చే అంశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మార్గదర్శకాలు సిద్దం:.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పధకం అమలుకు సంబంధించి షరతులు వర్తించనున్నాయి. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్‌జంప్షన్ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. 2022-23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు.

షరతులు వర్తిస్తాయి:వార్షిక విద్యుత్ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు 'జీరో' బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు. వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది.
వీరికే వర్తింపు:లబ్దిదారుడి రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్నారని నిర్దారించారు. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications