TS Polls: కేసీఆర్ ను ఆయన పథకాలే ముంచాయా ? ఆదర్శం నుంచి హ్యాట్రిక్ అడ్డుకునే దాకా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఫలితాలపై ఎన్నో విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇందులో ఒకప్పుడు దేశానికే ఆదర్శమంటూ చెప్పుకున్న పథకాలే కేసీఆర్ కొంప ముంచాయన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాలు, కేంద్రం కూడా అమలు చేయాల్సిందేనని డిమాండ్లు చేసిన పథకాలే ఈసారి ఎన్నికల్లో ఎలా కేసీఆర్ కొంపముంచాయో ఓసారి చూద్దాం..
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తాజాగా వెలువడిన లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వేలో సీఎం కేసీఆర్ ను ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న పథకాలే కొంపముంచాయని తేలింది. ఎందుకంటే ఈసారి బీఆర్ఎస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకే మెరుగులు దిద్దింది. ఉదాహరణకు ప్రభుత్వ ఆసరా పెన్షన్ పథకంలో ఇచ్చే మొత్తాన్ని 5016కు పెంచారు. అయితే అప్పటికే ఇస్తున్న వారు ఎంత మంది, వారికి పూర్తిస్ధాయిలో ఇస్తున్నామా లేదా అనేది ఆలోచించలేదు.

ఇలాగే రైతు బంధు, దళిత బంధు, మిగతా బంధు పథకాలన్నీ రాష్ట్రంలో ఉన్న నిజమైన లబ్దిదారులకు సాచురేషన్ పద్ధతిలో అందుతున్నాయా లేదా అన్నది కేసీఆర్ చూసుకోలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో మ్యానిఫెస్టో ప్రకటించగానే, దాన్ని తలదన్నేలా సంక్షేమ పథకాలను నింపేసి ప్రకటన చేశారు. అయితే అప్పటికే సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు అందకపోవడంతో ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించినవి తమకు భవిష్యత్తులో వస్తాయని లబ్దిదారులు నమ్మలేదు.
బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎప్పటినుంచో ఓటు వేస్తున్న వారిలో చాలా మందికి ఈసారి సంక్షేమ పథకాల లబ్ది జరగలేదు. కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే వీటితో లబ్ది పొందారు. దీంతో అసలైన లబ్దిదారులు తమకు పథకాలతో లబ్ది జరక్కపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. అదే సమయంలో కర్నాటకలో ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో వారిని ఆకట్టుకుంది. ఇది సహజంగానే బీఆర్ఎస్ కొంపముంచిందని లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే చెబుతోంది.












Click it and Unblock the Notifications