TS Polls: మైనారిటీ ఓట్లలో భారీ చీలిక ? బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీతో..
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని పరిస్దితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న రాజకీయ పరిమాణామాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పంచుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో మైనారిటీ ఓట్లను పంచుకునేందుకు అధికార, విపక్షాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం పోటీతో పలు నియోజకవర్గాల్లో ఈసారి ముస్లింల ఓట్ల చీలిక తప్పేలా లేదు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోరు రోజురోజుకూ హోరాహోరీగా మారుతోంది. ఇదంతా చూస్తుంటే చివరకు విజేతల మెజారిటీలపై ఈ ప్రభావం తప్పకుండా పడేలా కనిపిస్తోంది. స్వల్ప మెజారిటీతో అభ్యర్దులు విజేతలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ ఒకే వర్గం ఓట్ల కోసం రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరుతో ఓట్ల చీలిక ఖాయంగా తెలుస్తోంది. ఇందులో మైనారిటీ ఓట్ల చీలిక మరింత ఎక్కువగా ఉండేలా ఉంది.

గతంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో బీఆర్ఎస్-ఎంఐఎం కలిసి కూటమిగా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేవి. కానీ ఇప్పుడు పరిస్దితుల్లో వచ్చిన మార్పుతో ఎంఐఎం సిట్టింగ్ స్ధానాల్లోనూ, బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లతో గెలిచే స్ధానాల్లోనూ కాంగ్రెస్ బలమైన అభ్యర్దుల్ని పోటీకి పెట్టేసింది. దీంతో మైనార్టీ ఓట్ల కోసం ప్రతీ చోటా రెండు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే మలక్ పేట, నాంపల్లి సీట్లలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. దీంతో మైనార్టీ ఓట్ల చీలిక కూడా తప్పేలా లేదు.
అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు సీట్లలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల మధ్య మైనారిటీ ఓట్లు చీలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఎంఐఎం మద్దతుతో పలు సీట్లలో మైనార్టీలను సాలిడ్ ఓటు బ్యాంకుగా మార్చుకుంది. ఈ ప్రభావం ఇప్పుడు కాంగ్రెస్ తో ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో స్పష్టమవుతోంది. అయితే కాంగ్రెస్ కు రాష్ట్రవ్యాప్తంగా భారీ గాలి వీస్తే మాత్రం ఈ సమీకరణాలు ఏవీ చెల్లకుండా పోతాయనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications