తెలంగాణలో మండిపోతున్న ఎండలు: ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తూ చల్లని వాతావరణం ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు జనం. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ములుగు జిల్లాలోని తాడ్వాయి, నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, బుధవారం సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని కోల్కతా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications