TSPSC పేపర్ లీక్‍తో రూ.40 లక్షలు.. వాటిని ఎలా పంచుకున్నారంటే..!
తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అనేక మందిని విచారించింది. పేపర్ ఎవరెవరికి లీక్ అయిందో విచారణ చేస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆర్థిక అంశాలపై కూడా సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో మూడు ప్రశ్న పత్రాలను రూ.40 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. ఏఈ పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు అమ్మినట్లు తేల్చారు.
కేతావత్ రాజేశ్వర్.. పేపర్ల విక్రయాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రూ.40 లక్షలకు బేరం మాట్లాడుకోగా.. నిందితులకు రూ.23 లక్షలు ముట్టాయి. మిగతా డబ్బులు పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చెల్లించాలని మాట్లాడుకున్నారు. నిందితులు తీసుకున్న రూ.23 లక్షల్లో రూ.10 లక్షలు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు చేరినట్లు తేలింది. కాగా 8.5 లక్షలను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రవీణ్ పెన్ డ్రైవ్ లోకి ప్రశ్నపత్రాలు వచ్చిన తర్వాత అతను రేణుక, డాక్యా దంపతులకు ఇచ్చాడు. వీరు తమ సమీప బంధువు అయిన రాజేశ్వర్ కు పేపర్ల గురించి చెప్పి.. ఎవరైనా ఏఈ పరీక్ష రాసే వారికి పేపర్ లీక్ చేసి డబ్బు తీసుకోవాలన్నారు. అప్పుడు రాజేశ్వర్ గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్ర నాయక్ లో బేరం మాట్లాడుకున్నారు. ఈ నలుగురి నుంచి రాజేశ్వర్ మొదటి విడతగా రూ.23 లక్షలు తీసుకున్నాడు. ఇందులో రూ.15 లక్షలు రేణుక, డాక్యాకు ఇచ్చాడు. రేణుక, డాక్యా దంపతులు రూ.10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చారు. రాజేశ్వర్ రూ.8 లక్షలను తన వద్దే ఉంచుకున్నాడు.
ప్రవీణ్ కు వచ్చిన రూ.10 లక్షల్లో రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. రూ.1.2 లక్షలతో ఓ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.30 వేలు ఖర్చులకు వాడుకున్నాడు. మిగతా రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకున్నాడు.












Click it and Unblock the Notifications