టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఏఈ 16 ర్యాంక్ అభ్యర్థి అరెస్ట్, వరుసలో మరో 30 మంది!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. సూర్యపేట జిల్లాకు చెందిన ఏఈ పరీక్షలో 16వ ర్యాంక్ సాధించిన ఎం నాగరాజు అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. తాజా అరెస్టుతో ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన వారి సంఖ్య 53కు చేరింది.
గతంలో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అరెస్టైన ఏఈ పోల రమేష్ నుంచి సేకరించిన సమాచారం, సెల్‌ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పోల రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్‌కు బదిలీ చేశాడు. ఆ తర్వాత పరీక్ష రాసిన నాగరాజు.. 16వ ర్యాంక్ సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా, ప్రస్తుతం పోల రమేష్ కేంద్రంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోల రమేష్ ఇప్పటికే ఏడుగురికి ఏఈఈ, డీఏవో పరీక్ష కోసం హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేశాడు. పరీక్ష కేంద్రాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో జవాబులను మైక్రో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించి ఒప్పందం చేసుకున్న అభ్యర్థులకు అందించాడు. మరోవైపు, ఏఈ ప్రశ్నాపత్రాలను లక్షల రూపాయలకు విక్రయించాడు.

ఇక టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ తన వద్దకు ఏఈ పేపర్ రాగానే దాన్ని విక్రయించాలని తన స్నేహితుడు సురేష్‌కు చెప్పాడు. సురేష్‌కు బంధువైన పోల రమేష్ కు ఈ విషయం చెప్పగానే.. తాను విక్రయిస్తానంటూ ఆ ప్రశ్నాపత్రాలను తీసుకున్నాడు. ఆ తర్వాత పేపర్లు విక్రయిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు పొందాడు. గతంలోనే రమేష్ 30 మందికి పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రమేష్ వద్ద ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తూ వస్తున్నారు. మరో 30 మంది నిందితులను జులై నెలాఖరులోగా అరెస్ట్ చేసే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications