ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గేలా టీఎస్ఆర్టీసీ నయా ప్లాన్: మెట్రో రైలు మోడల్ సీటింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు అవుతున్న తరుణంలో బస్సులలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్ పై ఫోకస్ పెట్టిన tsrtc సిటీ బస్సులలో రద్దీ తగ్గించడానికి ప్లాన్ చేస్తుంది.
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఏకంగా 18 లక్షల నుంచి 20 లక్షలకు చేరింది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులలో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. ఇక సిటీలో పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఉదయం ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక సోమవారం, బుధవారం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. బస్సుల్లో సీటింగ్ ఇబ్బంది కనిపిస్తుంది.

దీంతో tsrtc బస్సులలో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని భావించి సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న బస్సులలో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండువైపులా మెట్రో రైలులో ఉన్నట్టుగా సీటింగ్ ను ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి, ఎక్కువమంది ప్రయాణించటానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది.
ఈ మేరకు కొన్ని బస్సులలో సీటింగ్ మార్చేసి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది. ఈ విధానం సక్సెస్ అయితే మొత్తం హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సులలో ఇదే విధానాన్ని తీసుకురానుంది. సిటీ బస్సులలో మొత్తం 44 సీట్లు ఉంటే, 63 మంది ప్రయాణం చేస్తే మొత్తం 100% ఆక్యుపెన్సీ గా ఆర్టీసీ భావిస్తుంది.
మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కడానికి దిగడానికి, కండక్టర్ టికెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది. టికెట్ ఇచ్చే క్రమంలో ఏ ఒక్కరికి జీరో టికెట్ ఇవ్వకపోయినా కండక్టర్ పై చర్యలు తీసుకుంటున్న క్రమంలో, ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా సీటింగ్ వ్యవస్థను మార్చడం మంచిదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మరి ఆర్టీసీ మెట్రో తరహా మోడల్లో బస్సుల్లో తీసుకువచ్చే ఈ కొత్త విధానం ఏమేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications