ప్రైవేటుకు ధీటుగా! టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు, ఈ రూట్లలోనే, ప్రత్యేకతలు ఇవే
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కోసం హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది టీఎస్ఆర్టీసీ.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యం కోసం మరో కీలక ముందడుగు వేసింది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆర్టీసీ సంస్థలో సంస్కరణలు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించగా.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కోసం హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ రూట్లలోనే టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు
ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో టీఎస్ఆర్టీసీ ఈ బస్సులున నడపుంది. ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా పేరు పెట్టారు.
అతి త్వరలో అందుబాటులోకి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు
బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి బస్సులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సజ్జనార్ తోపటు మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
లహరి ఏసీ స్లీపర్ బస్సుల ప్రత్యేకతలు ఇవే
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో కలిపి మొత్తం 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ ఏర్పాటు చేసి.. దాన్ని టీఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులో వైఫై సదుపాయంతో పాటు రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంది. బస్సు ముందు, వెనక భాగంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డుల్లో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్) కూడా ఉంది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications