మునుగోడు పోటీకి టీడీపీ దూరం-చివరి నిమిషంలో చంద్రబాబు కీలక నిర్ణయం- భవిష్యత్తు కోసమే!
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను రాజకీయ పార్టీలు ఇప్పటికే దాదాపుగా ప్రకటించాయి. చివరి నిమిషంలో టీటీడీపీ కూడా తమ అభ్యర్దిని బరిలోకి దింపబోతున్నట్లు నిన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం వెనక్కితగ్గారు.
మునుగోడు ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీపీ ఛీఫ్
బక్కని నర్సింహులు ప్రకటన విడుదల చేశారు. నాయకులు, కార్యకర్తలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మునుగోడులో పోటీకి దూరంగా ఉండాలని, సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు నర్సింహులు తెలిపారు. నిన్న ఐలయ్య యాదవ్ ను మునుగోడులో బరిలోకి దింపుతారని లీకులు ఇచ్చిన టీడీపీ ఇవాళ చివరి నిమిషంలో వెనక్కితగ్గడంపై ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో చతుర్ముఖ పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పోటీగా టీడీపీ అభ్యర్ధి బరిలోకి దిగితే మరింత ఓట్ల చీలిక తప్పదని తెలుగుదేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నల్గొండ జిల్లాలో తమకున్న పాత ఓటు బ్యాంకు అండతో ఓట్లు చీల్చినా అంతిమంగా అది టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కు మేలు చేసే అవకాశం ఉంది. దీంతో టీటీడీపీ వ్యూహాత్మకంగా మునుగోడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications