ఎర్రబెల్లిపై అక్రమ కేసులు: తెలంగాణ డిజిపికి టిటిడిపి ఫిర్యాదు, అవిశ్వాసంపై భట్టి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుపై అక్రమంగా కేసులు పెట్టారని తెలంగాణ టిడిపి నేతలు డిజిపి అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ డీజీపీని కలిసి టీడీపీ నేతలు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎర్రబెల్లిని పరామర్శించేందుకు తెలంగాణ నేతలు వరంగల్‌కు వెళ్లనున్నారు.
స్పీకర్‌పై అవిశ్వాసం
ఇది ఇలా ఉండగా, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపే నేతలను అణగదొక్కుతున్నారన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రొటోకాల్ పాటించడం లేదని , ప్రభుత్వ కార్యక్రమాలను గులాబీమయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి అన్ని పక్షాలను కలుపుకొని వెళతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల అనర్హతపై అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని , స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సైతం వెనుకాడమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ
ఎల్లుండి(సెప్టెంబర్ 30)న సిపిఐ తలపెట్టిన చలో అసెంబ్లీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి కోరుతూ సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎల్లుండి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.












Click it and Unblock the Notifications