కారెక్కనున్న వైసీపీ ఎంపీ: మంత్రి తుమ్మల రాజకీయమేనా?
హైదరాబాద్: తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్‌లోకి ఎంపీ పొంగులేటి చేరడం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన అధికార టీఆర్ఎస్‌కు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందని అంటున్నారు.
మంత్రి తుమ్మల నడిపిన రాజకీయ ఫలితమే తెలంగాణాలో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పాయం వెంకటేశ్వర్లు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
సోమవారం లోటస్ పాండ్ వేదికగా జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పొంగులేటితోపాటు పాయం వెంకటేశ్వర్లు సైతం హాజరయ్యారు. ఆ సమయంలో మీరు పార్టీలో ఉంటారా... ఉండరా? అని తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలంతా పొంగులేటిని సూటిగా ప్రశ్నించడంతో ఆయన మౌనమే తన సమాధానమని మిన్నకుండిపోయారట.

దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. పొంగులేటి బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సైతం పార్టీ వీడనున్నట్లు సమాచారం. తెలంగాణ వైసీపీ తరుపున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందగా, టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గతంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణలో వైసీపీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీరిద్దరూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుంగ శిష్యులు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం మేరకు వీరు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ సరైన వేదిక అని పొంగులేటి అనుచరులు సైతం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పార్టీ మారే అంశంపై ముఖ్యనేతలతో పొంగులేటి చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది. ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి పార్టీ మారిన పక్షంలో తెలంగాణలోని మిగతా వైసీపీ నేతలు సైతం పార్టీని వీడటం ఖాయంగా కనబడుతోంది. ఇదే జరిగే టీ టీడీపీ తరహాలోనే టీ వైసీపీ కూడా ఖాళీ కావడం తథ్యం.












Click it and Unblock the Notifications