కాంగ్రెస్ లోకి తుమ్మల, ముహూర్తం ఫిక్స్ - సీటుపై అసలు ట్విస్ట్..!!
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ లో చేరటం ఖామైంది. ఈ నెల 6న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నారు. ముఖ్య అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాలేరు నుంచి పోటీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అదే సీటు షర్మిల కోరుతున్నా...హైకమాండ్ ఈ ఇద్దరిలో ఎవరికి పాలేరు సీటు కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
6న కాంగ్రెస్ లోకి తుమ్మల: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. పొంగులేటి చేరిక తరువాత మరి కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని తుమ్మలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ నేరుగా తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

ఆ తరువాత ఖమ్మంలో రాజకీయంగా చాలా కాలంగా ఉప్పు - నిప్పు లా ఉన్న పొంగులేటి - తుమ్మల భేటీతో జిల్లా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. తుమ్మలను కాంగ్రెస్ లోకి రావాలంటూ పొంగులేటి ఆహ్వానం పై సానుకూల స్పందన వ్యక్తం అయింది. దీంతో, ఈ నెల 6న ఢిల్లీలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసారు.
పాలేరు సీటు నుంచి బరిలోకి: తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి హామీ లభించింనా.. పార్టీలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది. పాలేరు నుంచి తుమ్మలను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రయత్నిస్తోంది. చాలా కాలంగా జిల్లాలో కాంగ్రెస్ కు కీలకంగా ఉన్న నేతలు మాత్రం అక్కడ నుంచి షర్మిలకు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

షర్మిల తాజాగా ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో షర్మిలకు ఖచ్చితంగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, పాలేరు పోటీకి సంబంధించి ఇంకా తుది నిర్ణయం జరగలేదు. షర్మిల తెలంగాణ నుంచి పోటీకి రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
షర్మిల పోటీపై సందిగ్ధత: షర్మిల తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం సమయంతో తన పోటీకి సంబంధించి స్పష్టత తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. షర్మిలను రాజ్యసభకు పంపాలని రేవంత్ వర్గం సూచిస్తున్నట్లు సమాచారం. తాను తెలంగాణలో పార్టీ వ్యవహారాలకు పరిమితం అవుతానని, పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెబుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల పార్టీలోకి రావటం ద్వారా ప్రయోజనం ఉంటుందని షర్మిల వ్యతిరేక వర్గం నేతలు పార్టీ నాయకత్వం ముందు బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మల పార్టీలో చేరినా పాలేరు సీటు విషయంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఈ వారంలోనే షర్మిల పార్టీ విలీనం..పాలేరు సీటు పైన పార్టీ నిర్ణయం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications