సింగరేణి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం... పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం(ఏప్రిల్ 7) కేటీకే-6 గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. గని పైకప్పు ఒక్కసారిగా కూలడంతో కార్మికులు దాని కిందే చిక్కుకుపోయారు. మృతులను క్యాతం నరసయ్య, తలవెని శంకరయ్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శిథిలాల కింద మొత్తం ఎంతమంది చిక్కుకున్నారు... ఎంతమంది బయపడ్డారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ సింగరేణి రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గనిలో ప్రమాద వార్త తెలిసి కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. మృతుల కుటుంబాలు,బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

కాగా,బొగ్గు గనుల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండం కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ-2 వకీల్ పల్లి గనిలో పైకప్పు కూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారు.
గతేడాది జూన్‌లో గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్‌లో బ్లాస్టింగ్ మిస్‌ఫైర్ అయి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో గోదావరిఖనికి చెందిన రాకేష్, ప్రవీణ్,కమాన్ పూర్‌కు చెందిన రాజేష్, మరొకరు రత్నాపూర్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.మృతులకు రూ.40లక్షలు పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.