ప్రయాణికుల్లా నటిస్తూ చోరీలు: ఘరానా ముఠాకు చెందిన సిస్టర్స్ అరెస్టు
హైదరాబాద్: ప్రయాణికుల్లా నటిస్తూ వాహనాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను హైదరాబాదులోని శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మహ్మద్ అబ్ధుల్ బారి వివరాలను వెల్లడించారు.
కడప కు చెందిన తెలగపాముల గ్యాంగ్ సభ్యులు కవడి సరోజ(38), మేకల దుర్గా(40) అనే అక్కాచెల్లెళ్లు ప్రయాణికులుగా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఫిబ్రవరి 22న లాల్‌దర్వాజాకు చెందిన సంగీత శుభకార్యానికి వెళ్ళి వస్తూ తిరుగు ప్రయాణంలో చార్మినార్ వద్ద లాల్‌దర్వాజాకు చేరుకోవడానికి షేరింగ్ ప్యాసింజర్ ఆటోను ఎక్కింది.

ఇదే ఆటలో ప్రయాణిస్తున్న సరోజ, దుర్గా సంగీత బంగారు ఆభరణాలు దాచుకున్న బ్యాగ్‌ను దొంగిలించి నాగుల చింత వద్ద దిగి పోయారు. ఆటో దిగిన అనంతరం తన బ్యాగు కనిపించకపోవడంతో సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితురాలను గుర్తించారు.
ఈ నెల 17వ తేదీన నాగుల చింత వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా శాలిబండ అదనపు ఇన్‌స్పెక్టర్ నాగేష్ వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు పలు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. నిందితురాల వద్ద నుంచి 13 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications