పాలమూర్ లిఫ్ట్ భూసేకరణ: మంత్రులూ రియల్టర్లు సేఫ్.. పేదలకు సర్కార్ శఠగోపం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంత్రులు, ప్రజాప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ యజమానులకు బంగారం పండిస్తున్న భూములు అన్నదాతకు మాత్రం నిరాశ మిగులుస్తున్నాయి. జాతీయ రహదారి పక్కనే వందల ఎకరాలు కొన్న ప్రముఖులు.. మంత్రులు.. తమ భూములు మునగకుండా చూసుకుని కోట్ల రూపాయల సంపదను కూడబెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రజాప్రయోజనాల పేరిట నామ మాత్రపు పరిహారంతో పేద రైతుల భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న ఉదంతం మహబూబ్‌నగర్‌ జిల్లా ఉదండాపూర్‌ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ పరిధిలో జరుగుతున్నది.

పోలేపల్లి సెజ్‌ భూముల విషయంలో రైతులకు ఎకరాకు కేవలం రూ.1.50 లక్షల పరిహారం ఇచ్చిన సర్కార్.. అదే భూమిని పరిశ్రమలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున అమ్ముతున్నది. ఉదండాపూర్‌కు 500 మీటర్ల దూరంలో భూమి ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతున్నది.

అంత విలువైన రైతుల భూములను సర్కార్ రిజర్వాయర్‌లో ముంచుతూ రూ.నాలుగు లక్షల పరిహారమే చెల్లిస్తామంటున్నది. ఆ పరిహారం అప్పులకు కూడా సరిపోదని, మెరుగైన పరిహారం ఇచ్చేవరకూ రిజర్వాయర్‌ కట్టనివ్వబోమని రైతులు హైకోర్టుకెళ్లారు. అక్కడ తమకు న్యాయం దక్కకపోతే సుప్రీంకోర్టుకూ వెళ్తామని అంటున్నారు.

ఆరువేల ఎకరాల భూమి హాంఫట్

ఆరువేల ఎకరాల భూమి హాంఫట్

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలోనే ఉదండాపూర్‌ గ్రామముంది. ఉదండాపూర్‌, వల్లూరు శివార్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 16.9 టీఎంసీల సామర్థ్యంతో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను కట్టేందుకు సర్కారు పూనుకుంది. దీని కింద ఉన్న ఐదు తండాలు, రెండు గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. ఉదండాపూర్‌లోని 5000 మంది, వల్లూరు, ఐదు తండాల్లోని 6000 మంది నిర్వాసితులు కానున్నారు. ఉదండాపూర్‌లో 3,500 ఎకరాలు, వల్లూరులో వెయ్యిఎకరాలు, నాలుగు తండాల్లో 1500 ఎకరాలను రైతులు కోల్పోనున్నారు. ఆ భూములకు సర్కార్ ఎకరాకు కేవలం నాలుగు లక్షలే చెల్లిస్తామంటున్నది. ఈ భూములకు అర కిలోమీటరు దూరానా జిల్లా మంత్రలవి 500 ఎకరాలు ఉన్నాయని వినికిడి. బాలానగర్‌, శంషాబాద్‌ దగ్గర్లో ఉండటంతో ఆ భూములు ఎకరాకు రూ.50 లక్షల నుంచి కోటివరకు పలుకుతున్నాయి. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ కింద పెద్దల భూములు మునగకుండా పేదలకు నష్టం వాటిల్లేలా రిజర్వాయర్ డిజైన్ చేశారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పరిహారంతో అప్పులకే సరి.. అందుకే హైకోర్టుకెళ్లాం

పరిహారంతో అప్పులకే సరి.. అందుకే హైకోర్టుకెళ్లాం

ఉదండాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరాన పోలేపల్లి సెజ్‌ సమీపంలో ఓ మంత్రి దాదాపు 30 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి హెచ్‌ఎండీఏ అనుమతులు కూడా లభించాయి. ప్లాట్లు, విల్లాలుగా మార్చి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఆ లేఔట్‌లో స్థలం రేట్లను హోర్డింగుల ద్వారా తెలియజేస్తున్నారు. 200గజాల స్థలంలో ఒక ఇంటిని నిర్మించి కొనుగోలుదారుడికి ఇవ్వడానికి దాదాపు రూ. 27లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే మంత్రికి బాలానగర్‌ సమీపంలో 500 ఎకరాలు ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. తన భూమికి నీరొచ్చేలా రిజర్వాయర్‌ను ఉదండాపూర్‌కు తెప్పించుకున్నారని విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. ఎకరాకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇదివరకు చేసిన అప్పులకే సరిపోతాయని గతంలో పంటరుణాలు ఇచ్చిన బ్యాంకులతో పాటు ప్రయివేట్ రుణదాతలు కూడా వచ్చే పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని నిర్వాసితులు అంటున్నారు. ఒక వైపు భూములు పోయిన దు:ఖంలో నిర్వాసితులు ఉంటే.. పరిహారం కింద వచ్చే డబ్బును అప్పుల కింద జమచేసుకోవడానికి బ్యాంకులు సిద్ధం అవుతున్నాయి. డబ్బులు ఇచ్చేది ఆర్డీఓ కావడంతో ఆయనకే నోటీసులు జారీ చేస్తున్నాయి. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వకుండా సర్వే నంబర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాయి.

రైతులకు మెరుగైన పరిహారమివ్వరు

రైతులకు మెరుగైన పరిహారమివ్వరు

మునిగిపోయే ఊరుకు అప్పులిస్తే ఎగ్గొడతారని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం మానేశాయి. తహసీల్దార్‌ క్లియరెన్స్‌ ఇస్తేనే మిగతా రాయితీలు వస్తాయి. కానీ రిజర్వాయర్‌ కింద మునిగే భూములకు తహసీల్దార్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు సమితిలను కూడా ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా వేయలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ ఉదండాపూర్ గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పొలానికి పొలం, ఇల్లుకు ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి తర్వాత మాట తప్పినందుకే తాము కోర్టు మెట్లెక్కాల్సి వచ్చిందని చెప్పారు.

సుమారు 50 మంది రైతులు హైకోర్టు మెట్లెక్కి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆటుపోట్ల నడుమ ముందుకు కదులుతోంది. రైతులకు మెరుగైన పరిహార ఇవ్వక, సర్కారు అలసత్వంతో పథకం నత్తనడకన సాగుతున్నది. సర్కారు మెరుగైన పరిహారం ఇవ్వకపోవటంతో భూములిచ్చేందుకు రైతులు భూములిచ్చేందుకు ముందుకు రావట్లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 11, 911 ఎకరాలకు ఇప్పటిదాకా 6,041 ఎకరాలు సేకరించింది. మిగతా భూముల సేకరణకు రైతులు విముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణలో వేగం పెరగట్లేదు. వనపర్తిలో 4063 ఎకరాలకు 3157 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 11358 ఎకరాలకు గాను 5,373 ఎకరాలు మాత్రమే సేకరించారు. 2017-18లో రూ. 4800 కోట్లు కేటాయించి కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

పోలేపల్లి సెజ్‌లో ఎకరం భూమి రూ.50 లక్షల పైనే

పోలేపల్లి సెజ్‌లో ఎకరం భూమి రూ.50 లక్షల పైనే

పనుల జాప్యంతో రూ. 32,500కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు రూ. 55వేల కోట్లకు చేరింది. దీంతో కాంట్రాక్టర్లు లబ్దిపొందుతున్నారే తప్ప అన్నదాతలకు ఒరిగిందేమీ లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే తమ ఊరికి 500 మీటర్ల దూరాన ఉన్న పోలెపల్లి సెజ్‌లోని ఎకరం భూమి రూ.50 లక్షలకు పైనే పలుకుతోందని ఉదండాపూర్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు తెలిపారు.

కానీ తమకు ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.4 లక్షలకు మించి ఇవ్వబోమంటున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం బ్యాంకు రుణం, ప్రయివేటు అప్పులకే సరిపోతాయని, తమకు మిగిలేదేమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గూడుబాయి సాయిరెడ్డి అనే రైతు మాట్లాడుతూ పదేండ్ల కింద శంషాబాద్‌ విమానాశ్రయం నిర్మిస్తున్న సమయంలో రెండున్నరెకరాల సాగుభూమిని పోగొట్టుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత ఉదండాపూర్‌కు వచ్చి 31 ఎకరాల భూమి కొని మామిడి తోట వేశానని, తోట కాపుకు వచ్చి మా కష్టాలు తీరే దశలో నోటికాడి బువ్వను కాలదన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెత్తినోరు మొత్తుకున్నా వినట్లేదు. అందుకే హైకోర్టుకు పోయామని, అక్కడా న్యాయం జరుగకుంటే సుప్రీంకోర్టుకు పోతామని తేల్చి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Palamur - Ranga Reddy Lift irrigation project benefited for contractors only. Its cost gone upto Rs.55 thousand crores while government didin't come to pay exgratia for farmers of their lands as per 2013 land aquition act. Udandapur and other villages farmers are gone to high court for justice.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X