అల్లు అర్జున్ అరెస్ట్‌లో ఊహించని పరిణామాలు
సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను పోలీసు వాహనంలోనే స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా కారు ఎక్కారు కానీ ఆయన్ను పోలీసులు దించేశారు. బన్నీని పోలీసులు తీసుకువెళుతుండగా భార్య స్నేహారెడ్డి కంగారు పడుతుండటంతో అల్లు అర్జున్ ఆమెకు ధైర్యం చెప్పి పోలీసు వాహనం ఎక్కారు. ఐదు నిముషాల సమయం కావాలని అడిగిన బన్నీ కాఫీ తాగి పోలీసులతోపాటు వెళ్లారు.
తొక్కిసలాటలో మరణించిన రేవతి
డిసెంబరు 5వ తేదీన పుష్ప2 విడుదలవగా, దానికి ముందురోజు నాలుగోతేదీ రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ టీం, పుష్ప2 టీం అక్కడకు వచ్చారు. అల్లు అర్జున్ ఓపెన్ టాప్ జీపులో రావడం, అభిమానులకు అభివాదం చేయడంతో ఒక్కసారిగా అభిమానులంతా లోయర్ బాల్కనీలోకి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించగా, ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు సాయితేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ బాబు పరిస్థితి సీరియస్ గా ఉంది. మరికొద్దిరోజులు గడిస్తేకానీ ఏమీచెప్పలేమని వైద్యులు అంటున్నారు.

ఇంటిదగ్గర ఉద్రిక్తత
రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ కు వచ్చారంటూ పోలీసులు ముందుగా థియేటర్ యజమానికి, మేనేజర్ ను, సెక్యూరిటీ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం సెక్షన్ 115, 118(1) కింద అల్లు అర్జున్ పై, పుష్ప2 టీంపై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అభిమానులంతా బన్నీ ఇంటికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications