కిషన్ రెడ్డికి ఊహించని షాక్.. గులాబీ గూటికి బీజేపీ కీలక నేతలు!!
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని బిజెపిలోని కీలక నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బిజెపిలోకి చేరికలు లేకపోగా, రాష్ట్రవ్యాప్తంగా బిజెపిలో ఒక సందిగ్ధ వాతావరణం చోటు చేసుకుంది.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉన్న జోష్, ప్రస్తుతం బిజెపిలో కనిపించడం లేదు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే, మరీ ముఖ్యంగా అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులే షాకిచ్చారు. బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు, గద్వాల జోగులాంబ జిల్లా బిజెపి ఇన్చార్జి వెంకటరెడ్డి బిజెపికి రాజీనామా చేశారు.

వారు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వెళ్లి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంబర్ పేట టికెట్ అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ క్రమంలోనే వారు బిజెపికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. బిజెపికి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న వారు, అంతకుముందు బిజెపిని వీడుతున్నందుకు కన్నీటి పర్యంతమయ్యారు.
వెంకట్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో 43 సంవత్సరాలుగా స్వయం సేవకుడిగా పనిచేస్తున్నారు. గత నలభై మూడు సంవత్సరాలుగా బీజేపీ కోసం నిస్వార్ధంగా సేవ చేసినప్పటికీ తమను పార్టీ గుర్తించలేదని వెంకట రెడ్డి ఆరోపించారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలను భరించలేక తాము బిజెపికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న వెంకటరెడ్డి దంపతులను మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ పరిణామం బీజేపీకి ఊహించని షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో ఇది తీవ్రమైన దెబ్బ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications