పద్మ అవార్డులపైనా, కేంద్ర పథకాల పేర్లు మార్పుపైన కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరిక!
కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోమని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. అలాగే ఒకవేళ కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే మాత్రం... ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో నేడు మాట్లాడారు.
కేంద్రమే డైరెక్ట్ పథకాలు ఇచ్చే పరిస్థితి తేవొద్దు
ఈ సందర్భంగా ఆయన కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేర్లు పెట్టుకోవటం క్షమించరాని నేరమన్నారు. కేంద్రమే నేరుగా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలను అందించేందుకు రెడీ అయ్యిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. పరిస్థితి అంత దాకా తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలనం
ఇక పద్మ అవార్డులకు ప్రతిపాదించే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి పంపాలని సూచించారు. నక్సల్స్ భావజాలమున్న గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డు ఇచ్చేది లేదన్నారు. గద్దర్ వందలాది మంది బీజేపీ కార్యకర్తల చావులకు కారణమయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. అట్లాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
కేంద్ర పథకాలకు మీరు పేర్లు ఎలా పెడతారని ప్రశ్న
తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రగిలించి లబ్ది పొందాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయని, కానీ ప్రజలందరికీ ఈ విషయం అర్ధమైందని బండి సంజయ్ స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏ పేరు పెట్టుకున్నా నో ప్రాబ్లం.. వాళ్లకు ఇష్టమైతే ఒసామా బిడ్ లాడెన్, దావూద్ పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు కొత్త పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు.
రేషన్ ఇస్తుంది కేంద్రం.. ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి డబ్బు తెచ్చి ఖర్చు చేస్తున్నారా? అని బండి సంజయ్ నిలదీశారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా అలాంటప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు? అని బండి సంజయ్ నిలదీశారు.
తెలంగాణలో జరిగిన ప్రగతి అంతా కేంద్ర నిధులతోనే
గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతో జరిగిన ప్రగతి మీ ఖాతాలో వేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగిన అభివ్రుద్ది అంతా కేంద్ర నిధులతోనే అన్న బండి సంజయ్ రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అన్నారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి మీ పేర్లు పెట్టుకుంటే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications