అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండతీవ్రత నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ.. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆరబోసిన ధన్యాలు, పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాగా, మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణం లేదా సాధాణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే నాలుగు రోజులపాటు ఇలాగే ఉంటుందని.. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగండ్లు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షం పడే సమయంలో అవసరమైతే తప్ప రైతులు, ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications