అకాల వర్ష బీభత్సం.. ఉగాది ముందు రైతన్నలకు పెద్ద కష్టం, అపార పంట నష్టం!!
అకాలవర్షంతో రైతన్నలు విలవిలలాడుతున్నారు. తెలంగాణాలో ఉగాది ముందు రైతన్నలకు వర్షం దెబ్బకు పెద్ద కష్టం వచ్చి పడింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో అపార పంట నష్టం జరిగిందని ప్రాధమిక అంచనా.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నలకు ఊహించిన విధంగా కురుస్తున్న అకాల వర్షాలు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వాన ప్రభావంతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఉగాది పండుగకు ముందు అన్నదాతలు ఊహించని కష్టాల్లో పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల ప్రభావంతో చేతికి రావలసిన మొక్కజొన్న పంట, వరి, శనగ తీవ్రంగా దెబ్బతినగా, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా మామిడి రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రాథమిక అంచనాలను రూపొందిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అన్ని జిల్లాల్లోనూ మొత్తం నష్టం పై త్వరలో స్పష్టత వస్తుందని, నష్టాన్ని అంచనా వేసి పంట నష్టం పై కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంది.

ఇదిలా ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు హెలికాఫ్టర్ ద్వారా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి, వివిధ జిల్లాలలో బాధితులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అపార పంట నష్టం జరిగింది. పంట పొలాలలో మొక్కజొన్న నేల వాలింది. గింజ దశలో ఉన్న వరి కూడా నేల వాలింది. వడగళ్ల కారణంగా, ఈదురు గాలుల ప్రభావంతో మామిడికాయలు, పిందెలు ఎక్కడికి అక్కడ రాలిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి 12 నుంచి 13 లక్షల టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తే, అకాల వర్షాల ప్రభావంతో సగం కంటే తక్కువకు మామిడి దిగుబడి పడిపోయే అవకాశం ఉందని ప్రస్తుతం తెలుస్తుంది. ఇదిలా ఉంటే కూరగాయల పంటలు సైతం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇంకా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే పరిహారం అందించాలని రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications