భాగ్యలక్ష్మి దేవాలయంలో సీఎం యోగీ - భారీ భద్రత : వరుసగా బీజేపీ నేతలు..!!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ..చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద రద్దీ పెరిగింది. గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం గురించి పదే పదే ప్రస్తావించారు. ఆ ఎన్నికల సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు బీజేపీ నేతలు భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక, ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సమావేశాల సమయంలోనూ పలువురు కీలక నేతలు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. తాజాగా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాధ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసారు. కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన..శనివారమే ఈ దేవాలయానికి రావాల్సి ఉంది. దీని కోసం ముందుగానే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. కానీ, ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ రోజున బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటుగా పలువురు బీజేపీ నేతలతో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఈ రోజున రెండో రోజు ప్రధాని మోదీ కలక ప్రసంగం చేయనున్నారు. తెలంగాణ పైన ప్రత్యేకంగా తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్దమయ్యారు.

ఈ రోజు తెలంగాణ తీర్మానం పైన చర్చించి.. ఆమోదించనున్నారు. ఇక, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ నేతలు...ఈ తీర్మానం సమయంలో తమ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంగారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రధాని ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు.

దీంతో..ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సైతం ప్రధాని లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తాము చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో..జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కేసీఆర్ ను ఉద్దేశించి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications