చంద్రబాబును తిట్టడమే కెసిఆర్ పని: ఉత్తమ్ కుమార్ రెడ్డి, అరెస్టు
కరీంనగర్/ హైదరాబాద్: తమ పార్టీ నేతలను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిట్టడమే పనిగా పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పాలనపై దృష్టిపెట్టడం లేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
బుధవారం గాగిల్లాపూర్ హైవేపై జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేయడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ. 500 కోట్లు వెచ్చించారని, దానిని ఇప్పుడు రద్దు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటోనని ఆయన ప్రశ్నించారు.

అదే విధంగా ఈ ప్రాజెక్టుకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, అలా కాకుండా దాని పనులు పునరుద్దరించకుండా ఉంటే ఊరుకోబోమని ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నాలుకకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని, సీఎంకు ఏ అంశంలోనూ స్పష్టత లేదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
రాజీవ్ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు కాంగ్రెసు నేతలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
హైకోర్టు విభజనపై కేంద్రం ఆలస్యం చేయటం సరికాదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా 10 శాఖల్లో ఉద్యోగుల విభజన పూర్తి కాలేదని, అందువల్లే రాష్ట్రంలో సమస్యలున్నాయని, ఉద్యోగుల విభజన కోసం త్వరలో జేఏసీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications