బాబు ఇంట్లో చేపల పులుసు తిన్నావుగా!: కేసీఆర్‌పై ఉత్తమ్, ‘హరీశ్ లేఖతో తేలిపోయింది’
హైదరాబాద్: తాము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకెంటి? అని టీఆర్ఎస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

హరీశ్ లేఖ తేల్చేసింది.
మంత్రి హరీశ్‌రావు తనకు రాసిన లేఖలో కాంగ్రెస్‌కు అధికారం అని తేల్చేశారని, టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు అనే కల చెదిరిపోయిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకని వారిని ప్రశ్నించారు. తాము ప్రజలకు జవాబుదారులమన్నారు.

మా పొత్తులతో మేకెంటి?.. బాబు ఇంట్లో చేపల పులుసు తిన్నావుగా..
‘మా పొత్తుల విషయంలో ఎందుకంత భయపడుతున్నారు? టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును చండీయాగానికి ముఖ్య అతిథిగా పిలిచి మీరు సన్మానించలేదా? చంద్రబాబులో ఏ మార్పు వచ్చిందని.. ఆయన ఇంట్లో చేపల పులుసు తిని వచ్చారు? తెలంగాణలో ఒక ప్రజాస్వామిక, ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది' అని ఉత్తమ్ తన లేఖ నిలదీశారు.

అది మీ చేతకాని తనం కాదా?
అంతేగాక, ‘తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, టీఆర్ఎస్ ఓటమిని ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఏ మార్పు వచ్చిందని ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడి వివాహానికి వెళ్లి టీడీపీ నేతలతో రహస్య మంతనాలు జరిపారు? ప్రధాని మోడీ భజనలో మీరు మునిగి తేలుతున్నారు. ఏడు మండలాలు ఏపీలో విలీనం చేసినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిలుపుదల కోసం బాబు లేఖలు రాశారని అనడం మీ చేత కానితనం కాదా?' అని కేసీఆర్‌ను ఉత్తమ్ నిలదీశారు.

ఇక కేసీఆర్ ఫాంహౌస్‌కే....
గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో పొత్తు పెట్టుకునేటప్పుడు టీఆర్‌ఎస్ నాయకులకు శరం లేదా అంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు గురించి ప్రశ్నించే నైతికతే ఆ పార్టీకి లేదంటూ పేర్కొన్నారు. మిషన్ భగీరథ అక్రమ ప్రాజెక్టేనని, హరీశ్‌రావు వేసిన 12 ప్రశ్నల్లో ఏ ఒక్కటీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది కాదని ఉత్తమ్ అన్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని ఉత్తమ్ తన లేఖలో చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల ఐక్యతను చూసి భయపడుతున్నారంటే టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్లేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావాల్సిందేనని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications