నీ జాగీరు కాదు.. కేసీఆర్‌కు 'సీఎం'గా అర్హత లేదు.. బండి సంజయ్ పిచ్చి మాటలు.. : ఉత్తమ్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యవసాయంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని... ప్రతీ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేమీ మీ జాగీరు కాదని... పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
వరుసబెట్టి కీలక నిర్ణయాలు... త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్...

కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు : ఉత్తమ్
తెలంగాణ జనాభాలో 60-70శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారం 70లక్షల మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. కుటుంబాలతో కలుపుకుంటే దాదాపు 2.5కోట్ల వరకు వీరి జనాభా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న ఈ జనాభాను పట్టించుకోము అంటే ఇక కేసీఆర్ సీఎంగా ఉండడమెందుకు.. టీఆర్ఎస్ ప్రభుత్వమెందుకు అని ఉత్తమ్ ప్రశ్నించారు. పండించిన పంటలన్నీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు.

కాంట్రాక్టర్లకు,బ్రోకర్లకు దోచిపెట్టారు...
రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని గతంలో కేసీఆరే హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు పంటల కొనుగోలు వల్ల రూ.7500 నష్టం వాటిల్లిందని చెప్పి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కేటాయించిన రూ.10లక్షల బడ్జెట్‌లో రూ.7500 కోట్లు చాలా తక్కువ మొత్తం అన్నారు. రైతుల కోసం ఇంత తక్కువ భారాన్ని కూడా భరించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి కంటే ఎక్కువ అప్పులు చేసిన కేసీఆర్... ఆ డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు,బ్రోకర్లకు లక్షల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు

కేసీఆర్ మొదలుపెట్టినది కాదు..
గ్రామాల్లో ఐకేపీ సెంటర్లతో పంట కొనుగోలు ప్రక్రియ 2004లో కాంగ్రెస్ హయాంలో మొదలైందన్నారు. ఇదేమీ కేసీఆర్ వచ్చాకే మొదలుపెట్టింది కాదన్నారు. ఇదేదో తానే మొదలుపెట్టినట్లు... కరోనా కాలంలో గ్రామాల్లోకి వెళ్లి పంటలు కొనుగోలు చేశామని.. కానీ ప్రతీ ఏడాది సాధ్యం కాదని సీఎం ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అంటే,ఐకేపీ మహిళా సంఘాలు,వాటికి అనుబంధంగా ఉన్న ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ సొసైటీస్‌ను కూడా కేసీఆర్‌కు గాలికి వదిలేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు.

బండి సంజయ్ పిచ్చి మాటలు...
రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని కేసీఆర్ చెప్పడాన్ని ఉత్తమ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకీ మార్పు వచ్చిందన్నారు. టీఆర్ఎస్ తీరు గల్లీలో బీజేపీతో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని తాము ముందు నుంచే చెప్తున్నామన్నారు. బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలన్న కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రేపటి(డిసెంబర్ 30) నుంచి 7వ తారీఖు వరకు మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసనలు ఉంటాయని,18న భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు.