
కాంగ్రెస్ పార్టీలో చేరిన వడ్డేపల్లి రవి: తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి అలా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ నేత డాక్టర్ వడ్డేపల్లి రవి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వడ్డేపల్లి రవిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అభ్యంతరం చెబుతున్నారు.
రవి చేరికకు వ్యతిరేకిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన రవిని ఆరేళ్ళపాటు పీసీసీ సస్పెండ్ చేసిందని దయాకర్ తెలిపారు. ఇప్పుడు వడ్డేపల్లి రవిని తిరిగి పార్టీ ఎలా చేర్చుకుంటారని దయాకర్ నిలదీశారు. వడ్డేపల్లి రవి పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటికి రవి వెళ్ళారు. అయితే, రవిని కలిసేందుకు రేవంత్ రెడ్డి ఇష్టపడలేదని, మరో రోజు కలుద్దామని తన మనుషులతో చెప్పి పంపినట్లు సమాచారం.

వడ్డేపల్లి రవి, ఇతర నేతలను హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆధ్వానంగా ఉందన్నారు. రైతుల నుంచి పంటను కొనే పరిస్థితి లేదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు తొలగేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అవసరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మందు సీసాలు అమ్మి ఆదాయం సమకూర్చుకునే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏర్పడిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టవన్నారు. మూడోసారి గెలుపు కోసం రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలతో వైఎస్సార్ గతంలో రెండోసారి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ పాలన చాలా బాగుందని, కరోనా సమయంలో బాగా పనిచేశారని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.