రేవంత్ రాకపై పొంగులేటి, వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానంటే ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు. కాంగ్రెస్
హైదరాబాద్: టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరైతే పార్టీలోకి తీసుకున్నా.. అంత ప్రాధాన్యత ఇవ్వొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి చెబుతున్నారు.

అలాగైతే ఎవరైనా రావొచ్చు..
తాజాగా, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానంటే ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరొచ్చిన స్వాగతిస్తుందని చెప్పారు.

చింతిస్తున్నట్లు చెప్పాలి..
అంతేగాక, గతంలో రాహుల్, సోనియా, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పి.. పార్టీలోకి రావాలని స్పష్టం చేశారు. ఇది తన అభిప్రాయమని న్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.

రేవంత్‌ను వ్యతిరేకించొద్దు..
ఇది ఇలా ఉంటే.. మరో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాకను ఎవరు వ్యతిరేకించొద్దని అన్నారు. రేవంత్ రెడ్డిపై అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు.

నేనే ఆహ్వానించా..
తెలంగాణలో టీడీపీ లేదని.. అందుకే కాంగ్రెస్‌లోకి రావాలని రేవంత్‌ను తానే కోరానని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేరికలపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ సర్దుకుపోవాలని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని చెప్పారు. ప్రతిపక్షాలను కేసుల పేరుతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. బోఫోర్స్ కేసును తిరగదోడితే దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అభిమానులు ఆందోళన చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాపై ఉన్న కేసులను కూడా తిరగదోడాలని వీహెచ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications