తనను చూడడానికి రోహిత్ వస్తాడని తల్లి అనుకుంది: అదే చివరి రోజైంది
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం నాడు ఆమెతో పాటు రోహిత్ వేముల సోదరుడు రాజా, కొంత మంది బంధువులు విశ్వవిద్యాలయానికి వచ్చారు.
వారికి విశ్వవిద్యాలయం అధికారుల నుంచి కనీస మర్యాద కూడా దక్కలేదు. రోహిత్ తల్లి, సోదరుడు, బంధువులు వీసీ అప్పారావును కలపడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ తల్లి ఏకధాటిగా విలపిస్తూ ఆగ్రహం వెల్లగక్కడం తప్ప ఏమీ చేయలేకపోయింది.
ఒక సందర్భంలో ఆమె పల్స్ పూర్తిగా పడిపోయింది. దీంతో ఆమెను విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్‌కు తీసుకుని వెళ్లారు. రోహిత్ సస్పెన్షన్ గురించి కూడా విశ్వవిద్యాలయం అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు.

అసలేం జరిగిందో తెలుసుకోవడానికి తాము వీసీని కలవడానికి ప్రయత్నించామని, తమను కలవాలనే కనీస మర్యాదను కూడా ఆయన పాటించలేదని రాజా చెప్పారు. రాధిక తన ఇద్దరు పిల్లలతో ఉండిపోవడానికి 20 రోజుల క్రితం గుంటూరు నుంచి హైదరాబాదు సమీపంలోని ఉప్పల్‌కు వచ్చింది.
రాజా ఎన్‌జిఆర్ఐలో ఫెలోషిప్ ప్రాజెక్టు చేస్తున్నాడు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత రాధిక రోహిత్‌ను కలుసుకోలేదు. తనను కలవడానికి రోహిత్ ఆదివారం వస్తాడని ఆమె అనుకుంటూ ఉంటోంది. అదే రోజు అతనికి చివరి రోజు అవుతుందని ఆమె అనుకోలేదు. రోహిత్ తండ్రి వాచ్‌మన్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అంటారు.
విశ్వవిద్యాలయం కార్యకలాపాల్లో రోహిత్ తీరిక లేకుండా ఉండేవాడని చెబుతారు. ఆ బిజీలో డిసెంబర్‌లో జరిగిన సోదరుడి నిశ్చితార్థానికి కూడా అతను హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications