సీఎం కేసీఆర్ చెబుతున్న రెవెన్యూ ప్రక్షాళన అసలు రహస్యం వేరే ఉందా ? రాములమ్మ ఏమి చెబుతోంది ?
తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్దలవుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు . రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి అన్నారు . రెండేళ్ల క్రితం మియాపూర్ భూ కుంభకోణం వెలుగుచూసినప్పుడు మొత్తం రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ ప్రకటనలు గుప్పించారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు .

మియాపూర్ భూ కుంభకోణం అప్పుడే ప్రక్షాళన చేస్తానన్న సీఎం ఏం చేశారో .. రాములమ్మ ఫైర్
అప్పట్లో మియాపూర్ భూవివాదం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిందని, మియాపూర్ భూకుంభకోణంలో కేశవరావును అప్పుడు బలిపశువును చేశారని విజయశాంతి ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం మియాపూర్ భూ కుంభకోణం పై చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆసక్తిగా చూశారని, తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేసిందని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన బడా నేతలకు మియాపూర్ భూ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశాన్ని కేసీఆర్ అటకెక్కించారని ఆమె పేర్కొన్నారు .

తనకు సన్నిహితంగా ఉన్న వారిని కాపాడి బడుగు నేత కేశవరావుకు అన్యాయం చేశారన్న రాములమ్మ
తమకు సన్నిహితంగా ఉన్నవారిని కాపాడి, బడుగు వర్గానికి చెందిన కేశవరావును బలి చేసి అప్పటి భూ వివాదాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని అన్నారు. నిజానికి మియాపూర్ భూ వివాదానికి సంబంధించి తాను న్యాయపోరాటం చేస్తానని మొదట ప్రకటన చేసిన కేశవరావు చివరకు టీఆర్ఎస్ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి, తాను కొన్న భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి వచ్చిందని అన్నారు.

కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలో బయటపడుతుందన్న విజయశాంతి
సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తిరుగుబాటు చేసే స్ధాయిలో రాద్ధాంతానికి కారణమైన మియాపూర్ భూ దందా బయటపడిన రోజే రెవిన్యూ శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ నడుం బిగించి ఉండాల్సింది .రెవిన్యూ శాఖ ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకోట రహస్యం త్వరలో బయటపడుతుందని, అందులో ఉన్న అసలు మర్మం బయటపడే రోజు ఎంతో దూరంలో లేదని విజయశాంతి అన్నారు.












Click it and Unblock the Notifications